ఆసుపెన్నులో ఆసు, రాజు, రాణి
మరి కొన్ని.
1.
విషము గక్కె కాంగి వికృత రూపాన
అరువందేండ్లు మింగె యమ్మ విషము
విషమ మయ్యె యమ్మ విస్తుబోయె గనియు
వాణి బలుకు మాట నాదు నోట! 206
2.
ముదము గూర్చ నేడు మోడిదా వచ్చెను
చిన్న పాము పోయె చీక టందు
పెద్ద పాము లెల్ల పడమట జూసిరి (West)
వాణి బలుకు మాట నాదు నోట! 207
3..
ఏడ బోయె యన్న యాసుపెన్ను యనిరి
పన్ను లెల్ల మింగె పెద్ద యాస
ఆసు రాజు రాణి యాటలాడగ బోయె
వాణి బలుకు మాట నాదు నోట! 208
4.
భరత మాత చెప్పె భారము వదిలెను
దుష్ట బుత్రుల గని దండసిలితి
పీడ విరగ డాయె పాముల గుంపుల
వాణి బలుకు మాట నాదు నోట! 209
5.
యనగ నేను చెప్తి యమ్మకు చెవిలోన
పిలువ వలయు వెనుక పాము గుంపు
పీకి కోర విషము బయటకు గక్కగ
వాణి బలుకు మాట నాదు నోట! 210
6.
కక్క వలయు నల్ల కాసులు తిరిగొచ్చి
అపుడె వీని జనుల యాట కట్టు
వేట మృగ మున్ను వేటాడ తెలియును
వాణి బలుకు మాట నాదు నోట! 211
7.
జెట్టు సోకు నీకు జుట్టు పీకుడు మాకు
జుట్టు వదల బోము జట్టు మేము
లెఫ్ట్ రైటు కాదు లెక్కల మాస్టార్లు
వాణి బలుకు మాట నాదు నోట! 212
8.
తిన్న దెంత బయట దాచిన దెంతయొ
కక్కు వరకు నీది కుక్క బతుకె
వీధి బడ్డ నిన్ను వేటాడి తెస్తుము
వాణి బలుకు మాట నాదు నోట! 214
9.
తాత తండ్రి తల్లి తనయుడు బావయు
సొమ్ము దోచి దాయ స్విస్సు బ్యాంకు
తిరిగి తెచ్చి చింత తీర్తురు జనులకు
వాణి బలుకు మాట నాదు నోట! 215
తృప్తి లోనే అమృతం!
మూసుకున్న తలుపుల వెనుకను
తడికెల చాటున తలపుల లోనను
నక్కుతావెందుకు మిత్రమా
నీవు నడచిన త్రోవ కంటకమై,
బహు సంకటమై ఆటంకమైనందుకా?
నీ తపనంతా దివిని అందుకోలేనందుకా?
కంటకాలను దాటి, సంకటాలను మ్రింగి
ఇంత దూరమొచ్చిన నీవు
మృణ్మయ (మట్టి) పాత్రలో
ముత్యాలు వెదుకుటెందుకు
దొరికిన కంకరలే దొడ్డ కలిమి కాదొకో
గరికలే నీకు గరిమ మాన్యత కాదా?
తపన దేనికై తడబడకు మిత్రమా!
తలపుల ముడి చిక్కుముడేనోయి
తనువెందుకున్నదో ఎరుగవు
తనువేడ పోవునో ఎరుగవు
తిరిగి, తిరిగి తనువు ఎటులొచ్చునో తెలియదు
తిరిగి, తిరిగి తనువు ఎటులొచ్చునో తెలియదు
తావెరుగని తడుములాటలో
తీరమెరుగని యానం.
భవిత భవ్యం కాకున్నా
సతతమూ సమ్మతం కాకున్నా
జీవితం రమ్య కావ్యం కాకున్నా
నిత్య సాగర మధనం
తృప్తి లోనే అమృతం!
(వాణి విరచితం)
నిర్మల వైరాగ్యం
తన్ను తాను వెదికే
తపన లోపట
తాపసివయినావుగా!
ఇంత దూరమొచ్చి
ఇపుడు
తడబాటేల
తట్టక పోదు తరుణోపాయం!
నిశ్శబ్ద నీరవంలో
తావినందించే
పూలబాలనడుగు
తనువెందుకో చెప్తుంది
తానున్నా లేకున్నా
తన పేరు తలుచుకోవాలని!
బ్రతుకు టెందుకో తెలుసుకో
పయనం సాగించు
వెలుగు నీడల మధ్య
కలిమి లేముల నడుమ
వింతలెన్నెన్నో
ఆకళింపు చేసుకో
అవపోసన పట్టు!
అంతే తెలియని సాగరంలో
అంచు వెదికే అలల్లో
లేదా నిరంతర ఘోష!
గమ్యం తలియదని ఆగకు
గమనాన్ని సాగించు
ఆపకు నీ యానాన్ని
ఆయాస పడకు నట్టనడుమ
అల్లదిగో నీవు వెదికే స్వర్గం
అదే నిర్మలమైన వైరాగ్యం!
(వాణి విరచితం)